Matthew 11

1యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికీ, ప్రకటించడానికీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులను యేసు దగ్గరికి పంపించడం (లూకా 7:18-35)

2
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Mat 11:3.
In this translation, this verse contains text which in some other translations appears in verses Mat 11:2-Mat 11:3.
3క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యుల్ని పంపాడు.

4యేసు, “మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి. 5గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది. 6నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు.

7వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా? 8అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు? నాజూకు బట్టలు వేసుకొన్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసికొనే వారు రాజ భవనాల్లో ఉంటారు.

9మరింకేమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? సరే గాని, ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను.

10‘నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను,
అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు’
అని రాసి ఉన్నది ఇతని గురించే.

11స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో కచ్చితంగా చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైన వాడు అతని కంటే గొప్పవాడు.

12బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకూ పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు.

13ఎందుకంటే యోహాను కాలం వరకూ ప్రవక్తలూ, ధర్మశాస్త్రమూ ప్రవచిస్తూ వచ్చారు. 14ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలీయా ఇతడే. 15వినే చెవులున్నవాడు విను గాక.

16
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Mat 11:17.
In this translation, this verse contains text which in some other translations appears in verses Mat 11:16-Mat 11:17.
17ఈ తరం వారిని దేనితో పోల్చాలి? పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ‘మీ కోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ప్రలాపించాం గాని మీరు ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు.

18ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు. ‘అతనికి దయ్యం పట్టింది’ అని వారంటున్నారు. 19మనుష్య కుమారుడు తింటూ, తాగుతూ వచ్చాడు. కాబట్టి ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, పన్నులు వసూలు చేసే వారికీ పాపులకూ స్నేహితుడు’ అని వారంటున్నారు. అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది.”

జాతిపై యేసు తీర్పు ప్రకటించడం

20అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు. 21“అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకునేవారే.

22తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను.

23కపెర్నహూమా, పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా? నీవు పాతాళంలోకి దిగి పోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే! 24తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.”

25ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతుల్ని మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. 26అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం. 27సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు. కుమారుడూ, ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.

యేసు ఇచ్చిన వ్యక్తిగత ఆహ్వానం

28“మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

30

Copyright information for TelULB